విజయవాడ నగరంలో తిరుగుతున్న ప్రతి ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక డేటాబేస్‌లో భద్రపరచాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం ఏఐ ఆధారంగా పనిచేసే ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా ఆటోలకు సంబంధించిన నాలుగు వైపుల ఫొటోలు, ఆటో ఓనర్ పేరు, డ్రైవర్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు వంటి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఈ డేటా మొత్తం డేటాబేస్‌లో సేవ్ చేస్తారు. కేసుల విచారణ సమయంలో అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో పొందేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌కు సంబంధించిన లాగిన్, పాస్‌వర్డ్‌లను లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశంగా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ రూపొందిస్తున్నారు. పోలీసులు యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆ ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో వాహనం ఎవరిది, డ్రైవర్ వివరాలు ఏంటి అన్నది వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యూఆర్ కోడ్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. ఆటోలో ప్రయాణించిన వారు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వొచ్చు. డ్రైవర్ ప్రవర్తన, భద్రత, చార్జీల విషయంలో సమస్యలు ఉంటే టెక్స్ట్ బాక్స్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. విజయవాడ నగరంలో సుమారు 20 వేల ఆటోలు తిరుగుతున్నట్లు అంచనా. ప్రస్తుతం వాటన్నింటి వివరాలను దశలవారీగా నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 2 వేలకుపైగా ఆటోల సమాచారం సేకరించి, వాటికి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను సిద్ధం చేశారు. ఈ స్టిక్కర్లను ఆటోలపై తప్పనిసరిగా అతికించనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే రేటింగ్‌లు, ఫీడ్‌బ్యాక్‌ను ఏఐ వ్యవస్థ విశ్లేషించి నివేదికగా రూపొందిస్తుంది. ఈ నివేదికలను సంబంధిత లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పంపిస్తారు. డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని తేలితే, అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తారు. అవసరమైతే ఆ డ్రైవర్‌పై నిఘా పెంచే చర్యలు కూడా తీసుకుంటారు. ఈ కొత్త వ్యవస్థతో ఒకవైపు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, మరోవైపు ప్రయాణికుల భద్రత మరింత మెరుగవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఆటోలు కూడా ఇకపై నేరస్తులకు ఆశ్రయంగా మారకుండా, పోలీసుల నిఘాలో ఉండేలా ఈ ఏఐ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.
إرسال تعليق