గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా ఎలాంటి ఖరీదైన పరికరాలు కొనకుండానే, మీ దగ్గర ఉన్న హెడ్‌ఫోన్స్‌నే పర్సనల్ ట్రాన్స్‌లేటర్‌గా మార్చుకొనే సదుపాయాన్ని గూగుల్ కల్పించింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త గాడ్జెట్స్ కొనాల్సిన పనిలేదు. దీని సెటప్ చాలా సింపుల్  గా చేసుకోవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో (ఆండ్రాయిడ్ లేదా iOS ఏదైనా సరే) గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. ఏదో ఒక హెడ్‌ఫోన్స్ తీసుకోవాలి. అవి వైర్ ఉన్న ఇయర్‌ఫోన్స్ అయినా, బ్లూటూత్ హెడ్‌సెట్స్ అయినా లేదా నెక్ బ్యాండ్స్ అయినా పర్లేదు.. అన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. మంచి ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలి. ముందుగా ఫోన్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను ఓపెన్ చేయాలి. స్క్రీన్ పైన రెండు భాషలు కనిపిస్తాయి. ఎడమవైపు మీరు మాట్లాడే భాషను, కుడివైపు మీకు అనువాదం కావాల్సిన భాషను ఎంచుకోవాలి. స్క్రీన్ కింద ఎడమవైపున ఉండే " కన్వర్జేషన్" ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ వచ్చే ఆప్షన్లలో "స్టార్ట్" బటన్ నొక్కగానే లైవ్ ట్రాన్స్‌లేషన్ మొదలవుతుంది. మైక్రోఫోన్‌ను మాట్లాడుతున్న వ్యక్తికి కాస్త దగ్గరగా ఉంచాలి. యాప్ వారి మాటలను గ్రహించి, అనువదించిన భాషను నేరుగా హెడ్‌ఫోన్స్‌లో వినిపిస్తుంది. టెక్నాలజీ ఎంత గొప్పదైనా, మనం వాడే విధానం బట్టి ఫలితం ఉంటుంది. అనువాదం స్పష్టంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వీలైనంత వరకు తక్కువ శబ్దాలున్న ప్రదేశంలో మాట్లాడాలి. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటే యాప్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మాట్లాడుతున్న వ్యక్తికి దగ్గరగా, స్థిరంగా ఫోన్‌ను పట్టుకోవాలి. మాట్లాడే వ్యక్తిని మరీ వేగంగా కాకుండా, సాధారణ వేగంతో స్పష్టంగా మాట్లాడమని చెప్పాలి. ఒకేసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడితే యాప్ గ్రహించలేదు. అనువాదం సరిగ్గా రాలేదనిపిస్తే, మళ్లీ నెమ్మదిగా చెప్పమని రిక్వెస్ట్ చేయాలి. ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటేనే ట్రాన్స్‌లేషన్ కూడా వేగంగా, కచ్చితంగా జరుగుతుంది. గూగుల్ ట్రాన్స్‌లేట్ Vs యాపిల్ లైవ్ ట్రాన్స్‌లేషన్ మార్కెట్లో ఉన్న ప్రధాన సర్వీసుల మధ్య తేడా తెలుసుకోవడం ముఖ్యం. గూగుల్ ట్రాన్స్‌లేట్ అందరికీ అందుబాటులో ఉండే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ అనే తేడా లేకుండా అన్ని ఫోన్లలో, ఏ రకమైన హెడ్‌ఫోన్స్‌తో అయినా పనిచేస్తుంది. ఇది ప్రధానంగా 'వన్‌-వే' కమ్యూనికేషన్‌కు అంటే.. ఎదుటివారు మాట్లాడుతుంటే మీరు హెడ్‌ఫోన్స్‌లో వినడానికి అద్భుతంగా ఉంటుంది. ఇది 70కి పైగా భాషలను సపోర్ట్ చేస్తుంది. అదే యాపిల్ లైవ్ ట్రాన్స్‌లేషన్ విషయానికి వస్తే, ఇది యాపిల్ ఎకోసిస్టమ్‌కు మాత్రమే పరిమితం. దీన్ని వాడాలంటే లేటెస్ట్ iOS, యాపిల్ ఇంటెలిజెన్స్  సపోర్ట్ చేసే ఐఫోన్, కచ్చితంగా ఎయిర్‌పాడ్స్‌ ఉండాల్సిందే. అయితే, దీని అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇద్దరు వ్యక్తులు ముఖాముఖి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇద్దరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. 

Post a Comment

أحدث أقدم