ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలిలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా భూమి కొన్ని సెకన్లు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భూకంప తీవ్రత, కారణాలు తెలియజేయడానికి భౌగోళిక నిపుణులకు సమాచారం పంపినట్టు తెలుస్తోంది. అవసరమైతే ప్రాంతాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు సర్వే చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. స్థానికులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా పొదిలిలో గత మే 6న ఉదయం 9.54 గంటలకు కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ సమయంలో కూడా భూమి దాదాపు ఐదు సెకన్ల పాటు కంపించినట్లు స్థానికులు గుర్తు చేసుకున్నారు. కొత్తూరు బ్యాంకు కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేట వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ రోజు కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Post a Comment

أحدث أقدم