అమెరికాలో వలసదారులు, శరణార్థులు, ఇతర చట్టపరమైన రక్షణ ఉన్న వలసదారులకు వర్క్ పర్మిట్ల గడువును భారీగా తగ్గిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ,వలస సేవల సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఐదేళ్లుగా ఉన్న వర్క్ పర్మిట్ల గరిష్ట గడువు కాస్తా ఇప్పుడు 18 నెలలకు తగ్గించేశారు. దేశం నుంచి సాధ్యమైనంత త్వరగా వలసల్ని తరిమేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో భద్రతా సమీక్షలు ముమ్మరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వం వలస సేవల సంస్థ తెలిపింది. వర్క్ పర్మిట్లకు గరిష్ట గడువు తగ్గింపు వల్ల అమెరికాలో పని చేయాలనుకునేవారు ప్రజా భద్రతకు ముప్పు కలిగించకుండా లేదా హానికరమైన అమెరికా వ్యతిరేక భావజాలాల్ని ప్రోత్సహించకుండా ఉంటారని కూడా ఈ ప్రకటనలో తెలిపింది. గత వారం వాషింగ్టన్ డీసీలో ఉన్న వైట్ హౌస్ బయట నేషనల్ గార్డ్స్ పై జరిగిన దాడిని ఈ సందర్భంగా గుర్తుచేసింది. వైట్ హౌస్ దాడి తర్వాత విదేశీయులపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని తమకు ఆదేశాలు ఇచ్చినట్లు పౌరసత్వం వలస సేవల సంస్థ తెలిపింది. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం, వలసలు, శరణార్థులు, తొలగింపును నిలిపివేసిన వలసదారులు ,ఆశ్రయం లేదా గ్రీన్ కార్డ్ నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న వారు దీర్ఘకాలిక ఐదేళ్ల చెల్లుబాటు వ్యవధికి బదులుగా 18 నెలలకు పరిమితం చేయబడిన ఉపాధి అధికార పత్రాలు పొందబోతున్నారు.
0 Comments