అమెరికా వెళ్లాలనుకునేవారు డయాబెటిస్, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే వారికి వీసాలను తిరస్కరించాలని కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను దేశ రాయబార కార్యాలయాలు, కాన్సులర్ కార్యాలయాలకు పంపించింది. గతంలో టీబీ వంటి అంటు వ్యాధులకు స్క్రీనింగ్ నిర్వహించి వీసాలపై నిర్ణయం తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో డయాబెటిస్, ఊబకాయం వంటి జబ్బులను కూడా చేర్చారు. కొత్త నిబంధనల ప్రకారం వీసా దరఖాస్తుదారుల వైద్య చరిత్రను అధికారులు మరింత నిశితంగా పరిశీలించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అనుమతిస్తే ఖజానాపైన అదనపు భారం పడుతుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని అమెరికా వీసాపైన నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ వనరులపైన అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులకు వీసాలను నిరాకరించే నిబంధనలను కఠినతరం చేశారు. గుండెజబ్బులు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్, డయాబెటిస్, నాడీ సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అమెరికా వీసా తిరస్కరించే అవకాశం ఉంది. వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశం ఉన్న వారికి ప్రవేశాలను నిరాకరించారని మార్గదర్శకాలను ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ యూఎస్ వెళ్లాలనుకునే వారు వారి వైద్య ఖర్చులను సొంతంగా భరించగలరు లేదా అనే నిర్ధారించుకోవాలి అని వీసా అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు విదేశాంగ శాఖ ఈ వార్తలపైన ఎటువంటి స్పందన తెలియజేయలేదు. దీంతో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయా లేదా అన్న దానిపైన కూడా స్పష్టత లేదు.
0 Comments