ఆంధ్రప్రదేశ్ లోని రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా మరణించారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందరరాజ్ ధృవీకరించారు. మృతుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, శ్రీకాకుళంకు చెందిన జాంబ్రీ (చెల్లూరి నారాయణరావు) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా మూడు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. తాజాగా రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ''ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డా'' అని ఆమె హిడ్మాను వేడుకున్నారు. ఈలోపే ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందడం గమనార్హం. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉంది. ఆయన సతీమణి హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు (మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది. 25 ఏళ్ల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించారు. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై ఆయనకు పట్టుంది. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగించాయి.
إرسال تعليق