హైదరాబాద్ లో భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో విచక్షణ రహితంగా బ్యాట్‌తో తల మీద బాది హత్య చేశాడు. అమీన్‌పూర్ సీఐ నరేష్ వివరాల ప్రకారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీలో తమ ఇద్దరు పిల్లలతో కలసి కృష్ణవేణి, వెంకట బ్రహ్మం దంపతులు నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి సంగారెడ్డి జిల్లా కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా, వెంకట బ్రహ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే కృష్ణవేణి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త వెంకట బ్రహ్మం భార్య కృష్ణవేణిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో గత కొంత కాలంగా దంపతులు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. వీరి పాప హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతుండగా, 8 వ తరగతి చదువుతున్న బాబు ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. ఈ తరుణంలో ఆదివారం ఉదయం భార్య కృష్ణవేణితో గొడవ పడి ఆవేశంలో భర్త బ్రహ్మం బ్యాట్‌తో కొట్టి చంపినట్లు సీఐ నరేష్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ నరేష్ వెల్లడించారు.
0 Comments