ట్రేడ్‌మార్క్ 6E వినియోగంపై ఇండిగో ఎయిర్‌లైన్స్, మహీంద్రా ఎలక్ట్రిక్ మధ్య చట్టపరమైన యుద్ధం మొదలైంది. ఈ కేసు ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. కేసు తదుపరి విచారణ 2024 డిసెంబర్ 9న జరగనుంది. మొదట కేసును విచారించడానికి కేటాయించిన జస్టిస్ అమిత్ బన్సల్, స్వల్పకాలిక విచారణ అనంతరం దాని నుంచి వైదొలిగారు. ఇప్పుడు కేసుకు సంబంధించిన వాదనలను మరొక న్యాయమూర్తి వింటారు. విమానయాన సంస్థ ఇండిగో గత 18 సంవత్సరాలుగా 6E మార్క్‌ని తన ఐడెంటిటీలో కీలక భాగంగా ఉపయోగించుకుంది. కాల్ సైన్ 6E ని దాని బ్రాండింగ్‌లో ప్రముఖంగా ప్రదర్శించింది. అలానే 6E ప్రైమ్‌లో సీటు సెలక్షన్‌, ప్రయారిటీ చెక్‌ ఇన్‌, స్నాక్స్‌ అందుబాటులో ఉంటాయి. 6E ఫ్లెక్స్‌లో సౌకర్యవంతమైన రీషెడ్యూలింగ్, క్యాన్సలేషనన్‌ సర్వీసులు ఉంటాయి. ఎక్స్‌ట్రా లగేజీ ఆప్షన్లు, లాంజ్ యాక్సెస్ వంటివి 6E-బ్రాండెడ్ సర్వీసులు. ఎయిర్‌లైన్ 2015లో ట్రేడ్‌మార్క్ '6E లింక్'ని మల్టిపుల్‌ క్లాసెస్‌ కోసం రిజిస్టర్‌ చేసింది. అయితే '6E' ఏదైనా అనధికార వినియోగం దాని ట్రేడ్‌మార్క్, రెప్యుటేషన్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇండిగో వాదించింది. ఎయిర్‌లైన్ '6E' ప్రపంచ గుర్తింపును నొక్కి చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇటు ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ కారు BE 6Eని 2025 ఫిబ్రవరిలో విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ వాహనం ఇప్పటికే ఇన్నోవేటివ్‌ డిజైన్, టెక్నాలజీతో అందరి దృష్టిని ఆకర్షించింది. 2024 నవంబర్ 25న క్లాస్‌ 12 (మోటారు వాహనాలను కవర్ చేయడం) కింద 'BE 6E'ని రిజిస్టర్‌ చేయడానికి మహీంద్రా చేసిన దరఖాస్తును రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌ ఆమోదించారు. అయితే ఇండిగో ట్రేడ్‌మార్క్‌తో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ వాదిస్తోంది. ఎందుకంటే తమ ప్రొడక్టును 'BE 6E'గా బ్రాండ్ చేస్తున్నామని, కేవలం '6E'ని వినియోగించడం లేదని చెబుతోంది. ఓ అధికారిక ప్రకటనలో, మహీంద్రా దాని ఎలక్ట్రిక్ SUVలు, BE 6E, XEV 9E సహా, ఇండిగో బ్రాండింగ్‌కి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని హైలైట్ చేసింది. 'BE 6E' స్టైలింగ్, వినియోగం ఇండిగో '6E' నుంచి భిన్నంగా ఉన్నాయని కంపెనీ నొక్కి చెప్పింది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ పరిష్కారాన్ని కనుగొనడానికి ఇండిగోతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

أحدث أقدم