చైనాలో 200 జైళ్లు నిర్మాణం !


చైనా ప్రభుత్వం 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. వీటిని లియుజూ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. వీటిల్లో అనుమానితులను కుటుంబంతో కలవకుండా న్యాయ సాయం అందించకుండా దాదాపు ఆరు నెలల వరకు బంధించి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2012లో జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీపై పట్టు బిగిస్తున్నారు. జిన్‌పింగ్‌ వరుసగా అధికారం చేపట్టడం ఇది మూడోసారి. ఆయన మొదటి నుంచి అవినీతిపై పోరాటం పేరిట తన అసమ్మతి వర్గాన్ని జైల్లోవేస్తారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గతంలో ఉన్న షుయాంగి వ్యవస్థకు చెడ్డపేరు రావడంతో తాజాగా లియుజూ కేంద్రాలతో భర్తీ చేయనున్నారు. 24 గంటలూ గస్తీ, నిఘా కెమెరాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో కేవలం కమ్యూనిస్టు పార్టీ అధికారులేకాదు, అధికారులు, సివిల్‌ సర్వెంట్లు, హైప్రొఫైల్‌ వ్యక్తులు, వ్యాపారవేత్తలు వంటి వారిని లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2017-2024 మధ్యలో 210 లియుజూ సెంటర్లను నిర్మించడమో.. విస్తరించడమో చేశారు. ఇక్కడ బంధించిన వారిని కనీసం సరిగ్గా నిద్రకూడాపోనీయరు. వారు దాదాపు 18గంటల సేపు కూర్చొనే ఉండాలని ఈ కేంద్రాల్లో పనిచేసిన మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేంద్రాలను నిర్మించడానికి ప్రత్యేకమైన నిబంధనలున్నాయి. 2023 నుంచి 2027వరకు నిర్మాణం చేపట్టేవాటిల్లో ఖైదీలు తమకు తాము ఎటువంటి హానీ చేసుకోవడానికి వీల్లేకుండా చూడనున్నారు. ఇందుకోసం ప్యాడెడ్‌ వాల్‌, యాంటీ స్లీప్‌ సర్ఫేస్‌ వంటివి నిర్మించున్నారు. 

Post a Comment

0 Comments