పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. సవరణలతో పర్యావరణ చట్టాలను ఎలాంటి ప్రభావం చూపని వాటిగా మార్చారంటూ వ్యాఖ్యానించింది. అలాగే వ్యర్థాలను తగలబెట్టేవారిపై కఠిన చర్యలకు సంబంధించి కొత్త నిబంధనలను పది రోజుల్లో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇటీవల గాలి కాలుష్యాన్నిఅరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ విఫలం కావడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ''పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా వేయలేదు. ఏటా ఈ సమస్యను చూస్తుంటే సీఏక్యూఎం చట్టం అమలుకావడం లేదని తెలుస్తోంది. కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా చూపించండి. ఢిల్లీ ఎన్‌సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనిపిస్తోంది'' అని సీఏక్యూఎంను సుప్రీం ధర్మాసనం నిలదీసింది. కేవలం మీరు మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోయారని మందలించింది.
0 Comments