ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం చార్జి మెమో జారీ ?


ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం చార్జి మెమో జారీ చేసింది. ఒక ప్రజా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు గురించి సోషల్‌ మీడియా వేదికగా సునీల్‌ కుమార్‌ పెట్టిన పోస్టు ఆలిండియా సర్వీస్‌ నిబంధనల అతిక్రమణ కిందికి వచ్చింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని సంజాయిషీ కోరింది. ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ గత వైసీపీ ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయి వైపీఎస్‌ అధికారిగా ముద్ర పడ్డారు. సీఐడీ ఏడీజీగా ఉంటూ జగన్‌ అనుచరుడిలా పని చేస్తూ ఎవరైనా అప్పటి సీఎంపై చిన్న పోస్టు సోషల్‌ మీడియాలో పెట్టినా అర్ధరాత్రి వాళ్ల ఇంటికెళ్లి తీసుకొచ్చి చితక బాదారు. అప్పట్లో ఎందరో బాధితులు సీఐడీ వేధింపులు, థర్డ్‌ డిగ్రీపై కోర్టులోనే కన్నీరు పెట్టుకున్నారు. వారిలో ఒకరైన అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామరాజును చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనపై న్యాయపోరాటం చేస్తోన్న రఘురామరాజు, ఈ ఏడాది జూలై 11న గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ నుంచి తనను 2021 మే 14న గుంటూరుకు తీసుకొచ్చి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తీవ్రంగా కొట్టడంతోపాటు హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో ఏ-1 నిందితుడు సునీల్‌కుమార్‌ మరుసటిరోజు (జూలై 12) తన ట్విటర్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. 'ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన దా నిపై ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటి?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'మీ విజ్ఞతకే వదిలేస్తున్నా?' అని వ్యాఖ్యానించారు. చట్టపరంగా వ్యవహరించిన పోలీసులను బెదిరించేలా, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుల తీర్పులను సైతం వక్రీకరిస్తూ సునీల్‌ పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం సునీల్‌ కుమార్‌ను వివరణకోరింది. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు నేరుగా లేదా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలంటూ సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్‌) కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ సోమవారం జీవో-1965 జారీ చేశారు. పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వక పోయినా, ఎవరితోనైనా సిఫారసులు చేయించినా, రాజకీయ పరమైన ఒత్తిళ్లు తెచ్చినా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ప్రభు త్వం.. సునీల్‌ కుమార్‌ను హెచ్చరించింది. 

Post a Comment

0 Comments