సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలలో భాగంగా భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌పై ఇటీవల అభియోగాలు నమోదవ్వడం చర్చనీయాంశమైంది. వికాస్ పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో ఆ అధికారిని ఢిల్లీ పోలీసులు గతేడాది ఓ కిడ్నాప్, దోపిడీ కేసులో అరెస్టు చేసినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. ఢిల్లీ లోని రోహిణీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబరులో వికాస్ యాదవ్‌పై ఫిర్యాదు చేశాడు. వికాస్‌తో తనకు 2023 నవంబరులో పరిచయం ఏర్పడిందని, కొంతకాలం పాటు టచ్‌లో ఉన్నామని చెప్పారు. అయితే, గతేడాది డిసెంబరులో ఓ హోటల్‌కు పిలిచి తనపై దాడి చేసి దోపిడీకి యత్నించాడని పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబరు 18న వికాస్, అతడి అనుచరుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఈ ఏడాది మార్చిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ఆ మరుసటి నెలలోనే వికాస్‌కు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. పన్నూ హత్యకు కుట్ర కేసులో అతడిపై అభియోగాలు నమోదైన వేళ ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కుట్ర కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని కోర్టులో న్యాయశాఖ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో భారత పౌరుడైన వికాస్‌యాదవ్ (39)పై మనీలాండరింగ్, కుట్రకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియరావడం లేదని అందులో పేర్కొన్నారు. వికాస్ గతంలో భారత ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించారు. భారత విదేశీ ఇంటిలెజెన్స్ విభాగం, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం గతేడాది ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇప్పటికే చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్న నిఖిల్‌ను అమెరికాకు అప్పగించినట్లు ఆ మధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. అటు ఈ కేసు వ్యవహారంపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు కూడా జారీ చేసింది. అయితే, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్ దీనిపై విచారణ జరిపేందుకు స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ అభియోగాల్లో పేర్కొన్న భారత అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని న్యూదిల్లీ తమకు వెల్లడించినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఈ బృందం పర్యటన ముగిసిన తర్వాతే వికాస్ యాదవ్‌పై అగ్రరాజ్యం అభియోగాలు చేయడం గమనార్హం.
0 Comments