అక్టోబరు 28లోపు ప్రధాని పదవి నుంచి జస్టిన్ ట్రూడో వైదొలగాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రూడోకి సొంత పార్టీ ఎంపీలు వార్నింగ్ ఇచ్చారు. జస్టిన్ ట్రూడో సొంత లిబరల్ పార్టీలోని కొంతమంది ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. జస్టిన్ ట్రూడో నాలుగో సారి పోటీ చేయవద్దని కూడా వారు కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాన మంత్రిగా ట్రూడో ప్రజల మాటను ఇప్పటినుంచైనా వినాలని కొందరు ఎంపీలు అన్నారు. మరి కొంతమంది లిబరల్ పార్టీ ఎంపీలు మాత్రం జస్టిన్ ట్రూడో అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అనంతరం మాట్లాడుతూ.. ఎంపీలు నిజంగా ప్రధానికి సత్యాలే చెబుతున్నారా? ఆ సత్యాలను వినాలని భావించే ఉద్దేశం ట్రూడోకి ఉందా? అని అన్నారు. లిబరల్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 20 మంది శాసన సభ్యులం కలిసి వచ్చే ఎన్నికలలోపు ట్రూడో వైదొలగాలని కోరుతూ లేఖపై సంతకం చేశామని అన్నారు. కాగా, ఆ పార్టీలోని 153 మంది శాసనసభ్యులలో 24 మంది జస్టిన్ ట్రూడో రాజీనామా కోరుతూ లేఖపై సంతకం చేశారని కెనడియన్ మీడియా తెలిపింది. మిగతా శాసనసభ్యుల్లో చాలా మంది జస్టిన్ ట్రూడోకి మద్దతు తెలుపుతున్నప్పటికీ ఆయన ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. జస్టిన్ ట్రూడో మాత్రం తమ పార్టీ ఐక్యంగా ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీని తానే నడిపిస్తానని అన్నారు.
0 Comments