మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై కొంతమంది దుండగులు దాడిచేశారు. వారి నుంచి డబ్బులు దోచుకోవడమే గాక, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి సమీపంలోని ఓ పిక్నిక్ స్పాట్‌కు వెళ్లారు. అక్కడ కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడి చేశారు. తొలుత వారి వద్ద ఉన్న డబ్బు, నగలను బెదిరించి తీసుకున్న దుండగులు, ఆ తర్వాత మహిళల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఓ ట్రైనీ ఆఫీసర్ పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
0 Comments