వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి తాజాగా ఓ లేఖను పంపారు. ఈ సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని ప్రతిపాదించారు. అయితే, వైద్యులు చెబుతున్నట్లుగా 30 మంది కాకుండా, 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. ఈ ప్రతిపాదిత చర్చలు సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా వైద్యవిద్యార్థులు చేస్తున్న నిరసనలు దాదాపు నెల రోజులకు పైగా ఉద్ధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు బైఠాయించిన ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానించగా.. 30 మంది ప్రతినిధులకు అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్షప్రసారం చేయాలంటూ వారు షరతులు విధించారు. దీంతో చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ ప్రభుత్వం తాజాగా వారిని చర్చలకు ఆహ్వానించడం గమనార్హం.
0 Comments