ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీటి వరప్రదాయనిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉపద్రవం ముంచుకొచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. వరద ఉద్ధృతికి పుల్లింగ్ చైన్ తెగిపోయి శనివారం రాత్రి 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది. దీంతో రాత్రి నుంచి సుమారు 75వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతోంది. ఇదే విధంగా వెళితే రోజుకు 9 టీఎంసీల నీరు వృథా అవుతుంది. ఈ నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. మరో వైపు నిపుణుల బృందం డ్యామ్ వద్దకు చేరుకుంది. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాక కొత్తగేటు ఏర్పాటు చేసే అవకాశముంది. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏపీ వాటా 35 శాతం ఉండగా, డ్యామ్ నిర్వహణకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని తుంగభద్ర బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఘటన జరిగిందా? లేక మానవ తప్పిదమా?అని కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పల, గదగ్ జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర జలాశయం వర ప్రదాయనిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే స్పందించాయన్నారు. గేట్ల మరమ్మతుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎంత ఖర్చు అయినా వెనకాడవద్దని అధికారులకు తెలిపారు. సాంకేతిక నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో 4-4 అడుగుల గేట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు.
إرسال تعليق