ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ కల్పన కూడలి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త కారు (ఎఫ్‌ఆర్ రిజిస్ట్రేషన్) ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి కల్పన సెంటర్ వైపు అతి వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని బోల్తాపడింది. ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పేర్రాజుపేటకు చెందిన పీతా సతీష్ (32), కాకినాడ అవసరాలవీధికి చెందిన బి.లక్ష్మణ్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. వారి వెనుక మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జక్కం దుర్గాప్రసాద్ (32) తీవ్రంగా గాయపడ్డారు. అతడు జీజీహెచ్‌లో అపస్మార స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కారు నడుపుతున్న రామకృష్ణారావుపేటకు చెందిన చల్లా రామ్మోహన్‌కు తీవ్రంగా, ఆ వాహనంలో ఉన్న వెంకటనగర్‌కు చెందిన చిత్తుజల్లు పద్మకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. సతీష్, దేవి దంపతులకు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న కుమారుడి తొలి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉంటాడని భావిస్తున్నారు. కూడలిలోనూ మితిమీరిన వేగంతో వెళ్లడం గమనార్హం. కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన అనంతరం సర్కిల్‌లోని సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొని బోల్తాపడింది. అక్కడి ఐరన్ రెయిలింగ్ ధ్వంసమైంది. ఘటనా స్థలం వద్ద మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఒక మృతదేహం నుంచి చేయి విడిపోయి వేరేచోట పడగా, తల పగిలిపోయింది. రెండో వ్యక్తి కాలు నుజ్జునుజ్జయింది. కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, త్రీటౌన్ సీఐ కృష్ణ భగవాన్, టూ టౌన్ సీఐ నాగేశ్వరనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారును క్రేన్‌తో అక్కడి నుంచి తొలగించి స్టేషన్‌కు తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో కారు బీభత్సం : ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق