అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడి సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌తో వార్నర్ టీ20 కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే, తాజాగా వార్నర్ వన్డేల్లో రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గాడు. ఆసీస్ తరఫున మరోసారి ఆడాలని ఉందంటూ వార్నర్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. అధ్యాయం ముగిసింది అంటూనే సెలక్టర్లు ఎంపిక చేస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ''అధ్యాయం ముగిసింది!! సుదీర్ఘకాలం అత్యున్నత క్రికెట్ ఆడటం నాకు ఓ గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియా నా జట్టు. అంతర్జాతీయ స్థాయితోనే నా కెరీర్ ఎక్కువగా గడిచిపోయింది. ఇలా ఆడటం నాకు గర్వకారణం. అన్ని ఫార్మాట్లలో 100కుపైగా మ్యాచ్‌లు ఆడటం నా కెరీర్‌లోనే హైలైట్. ఈ జర్నీలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మన అనుభూతి, అనుభవాలు ఇతరులకు తెలియవు. క్రికెట్ అభిమానులందరినీ అలరించానని అనుకుంటున్నాను. ముఖ్యంగా టెస్టుల్లో! నేను ఇతరుల కంటే వేగంగా ఆడుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాను. ఇంకొన్నాళ్లు ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతాను. ఒకవేళ సెలక్టర్లు ఎంపిక చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నాను'' అని డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు.
إرسال تعليق