భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

ద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో శనివారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 53.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో ఏఎంసీ కాలనీలో సుమారు 200 మంది పునరావాస కేంద్రానికి తరలి వెళ్లారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, కుకునూరు, వేలేరుపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారం రోజుల నుంచి వరద ముంపులోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసరాలకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ఇంకా కొంతమేర నీటిమట్టం పెరగవచ్చని కేంద్ర జలవనుల శాఖ అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలోని అన్నదాన సత్రం, సుభాష్ నగర్ కాలనీ, కొత్త కాలనీలోనికి వరద నీరు రాకుండా అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి బ్యాక్ వాటర్ను ఎప్పటికప్పుడు తోడి బయటకు పోస్తున్నారు. మరోవైపు కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న నూతన గోదావరి కరకట్ట వద్ద వరద నీరు పట్టణంలోనికి రానీయకుండా అధికారులు జాతీయ రహదారిపై మట్టి పోసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments