క్వార్టర్‌ ఫైనల్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ !


పారిస్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. జర్మనీ జోడీ (మార్క్‌-మెర్విన్‌)తో సోమవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. మార్క్‌కు మోకాలి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గ్రూప్‌ సిలో ఆర్డియాంటో- ఆల్పియన్‌ (ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్‌ జోడీ లాబార్‌-కోర్వీ పరాజయం పాలవ్వడంతో సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో సోమవారం జరిగిన గ్రూప్ స్టేజ్‌ మ్యాచ్‌లో స్టార్‌ షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. 21-19, 21-14 తేడాతో జులియన్‌ (బెల్జియం)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి శుభారంభం చేసిన భారత్ హాకీ జట్టు సోమవారం పూల్ బిలోఅర్జెంటీనాతో జరిగిన తన రెండో మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. గోల్‌ కోసం ఇరుజట్లు మొదటి క్వార్టర్‌ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. రెండో క్వార్టర్‌ ప్రారంభమైన కాసేపటికి (22వ నిమిషం) లూకాస్ మార్టినెజ్ గోల్‌ చేసి అర్జెంటీనాను ఆధిక్యంలో నిలిపాడు. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిన భారత్‌ స్కోరును సమం చేయడానికి ప్రయత్నించింది. ఓటమి తప్పదనకుంటున్న సమయంలో 58వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో స్కోరు సమం అయింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత్ ఈ సారి కన్నా మెరుగైన పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆరు జట్లతో కూడిన పూల్ బిలో మొదటి నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. పురుషుల టీమ్‌ క్వార్టర్స్‌లో భారత ఆర్చర్లు నిరాశపర్చారు. తరుణ్‌దీప్, ధీరజ్, ప్రవీణ్‌ బృందం టర్కీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సెట్లలో 53-57, 52-55, 55-54, 54-57 పాయింట్లు చేసింది. ఫైనల్‌ స్కోరులో భారత్‌ 2-6 తేడాతో ఓడింది.

Post a Comment

0 Comments