పెరుగుతున్న నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం రేటు, తీవ్రమౌతున్న ఆర్థిక అసమానతలు, క్షీణిస్తున్న ప్రైవేట్ పెట్టుబడులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక కార్యకలాపాల విస్తరణపై బడ్జెట్ దృష్టి సారించాల్సి వుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రతిపాదనలు కుదింపులతో, తిరోగమన దిశలో వున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో విమర్శించింది. ఇది ప్రజలపై మరిన్ని భారాలను మోపడమే కాకుండా పెట్టుబడి స్థాయిలను, ఉపాధికల్పనను అణిచివేస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం 14.5 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు పేర్కొనగా.. వ్యయాలు కేవలం 5.94 శాతం మాత్రమే పెరిగింది. ఈ రెవెన్యూలను ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి బదులుగా జిడిపిలో ద్రవ్యలోటును 4.9 శాతానికి కుదించేందుకు వినియోగించింది. ప్రభుత్వ వ్యయాలను స్తంభింప చేయడమే కాకుండా సబ్సిడీలపై గణనీయంగా కోత విధించింది. ఆహార సబ్సిడీ 2022-23లో రూ.2,72,000 కోట్ల నుండి రూ.2,05,250 కోట్లకు తగ్గించగా, ఎరువుల సబ్సిడీని రూ.2,51,000 నుండి రూ.1,64,000 కోట్లకు తగ్గించిందని విమర్శించింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజి పథకంపై కూడా పూర్తి నిర్లక్ష్యం వహించింది. 2022-23లో రూ.90,806 కోట్ల నుండి రూ.86,000 కోట్లకు పడిపోయింది. ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఇప్పటికే రూ.41,500 కోట్లు ఖర్చు చేయగా, మిగిలిన ఎనిమిది నెలలకు కేవలం రూ.44,500 మాత్రమే మిగిలాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సరిపోదు. బడ్జెట్‌లో ఉపాధి కల్పన గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించినప్పటికీ.. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి కేటాయింపులు రూ.2,733 కోట్ల నుండి రూ.2,300 కోట్లకు తగ్గాయి. ఈ బడ్జెట్ సంపన్నులను మరింత సంపన్నులను చేయడం, పేదలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. దేశంలోని సంపన్నులపై సంపద పన్ను ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడానికి, ప్రజలపై పరోక్ష పన్నుల భారం నుండి ఉపశమనం కలిగించేందుకు నిరాకరించిందని విమర్శించింది.
0 Comments