కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఫలితంగా వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును 6.5 శాతంగా ఆర్బీఐ ఉంచింది. దేశంలోని బ్యాంక్‌లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది. అప్పుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దానినే రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి బ్యాంక్‌లకు కష్టమవుతుంది. అందుకే బ్యాంక్‌లు కూడా వివిధ లోన్లపై వడ్డీని పెంచుతాయి. ఇది కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. రెపో రేటు తగ్గితే.. ఆర్బీఐకి బ్యాంక్‌లు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. ఫలితంగా.. ప్రజలకు బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. గత ఏడాదిన్నర క్రితం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టింది ఆర్బీఐ. ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయి. మరి వడ్డీ రేట్ల కోతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మొదలుపెడుతుందో చూడాలి. "గత కొన్నేళ్లల్లో అనేక సంక్షోభాలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. కానీ భారత దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచింది. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం నిత్యం అప్రమత్తంగా ఉండాలి. డ్యూరెబుల్ బేసిస్ కింద ద్రవ్యోల్బణాన్ని 4శాతానికి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉంది," అని శక్తికాంత దాస్ తెలిపారు.
0 Comments