ఇరవై రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలో చేరే అవకాశం : ఎమ్మెల్యే రవి రాణా


కేంద్రంలో వరుసగా మూడోసారి భాజపా అధికారం చేపడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన నేపథ్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అందులో చేరే అవకాశం ఉందని మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం తరువాత 20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరుతారని రవి రాణా తెలిపారు. శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ చీలిపోతారని తాను ముందే ఊహించానని, ఇప్పుడు కూడా తాను చెప్పినట్లే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. "బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే కోసం కూటమిలోకి ఎల్లప్పుడూ ఒక కిటికీ తెరిచి ఉంటుందని ప్రధాని చెప్పారు. ఎన్డీఏలోకి తిరిగి రావడానికి ఉద్ధవ్ ఆ కిటికీని ఉపయోగించుకుంటారని నేను కచ్చితంగా చెప్పగలను" అని ఎమ్మెల్యే అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్ష ఇండియా కూటమితో కలిసి పని చేస్తున్నప్పటికీ ఆయనకు ఎన్డీఏలోకి వెళ్లడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో ఓ ఇంటర్య్వూలో ప్రధాని నరేంద్ర మోడీని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను బాలాసాహెబ్ ఠాక్రేకు సరైన వారసుడిగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ "బాలాసాహెబ్ ఠాక్రేకి నా పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఉద్ధవ్ కష్టాల్లో ఉంటే ఆదుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఉద్ధవ్ ఠాక్రే కోసం ఎల్లప్పుడూ ఒక కిటికీ తెరిచి ఉంటుంది" అని అన్నారు. ప్రధాని మోడీ మాటలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ, "తలుపులు తెరిచి ఉన్నప్పటికీ నేను మీ దగ్గరకు రాను. మీరు అధికారంలో ఉండరు కాబట్టి మీ వద్దకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు అని వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments