ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసే గడువు పొడిగించిన సుప్రీంకోర్టు !


ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో గల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు గతంలో విధించిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. గతంలో జూన్ 15 లోగా ఆప్ ఆఫీస్ను ఖాళీ చేయాలని గడువు విధించిన సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో ఆప్ ప్రధాన కార్యాలయం ఉన్నది. అయితే ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకు ఆప్ కార్యాలయం ఉన్న ప్రదేశాన్ని హైకోర్టుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో జూన్ 15లోగా ఆప్ పార్టీ ఆఫీస్ను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. అయితే ఆప్ అభ్యర్థన మేరకు ఆ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్ హర్షం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన గడువును మరో రెండు నెలలు పొడించడం సంతోషకర పరిణామమని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. తాజా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 'ఆప్ ఢిల్లీ పార్టీ అయినప్పుడు ఒక కార్యాలయం కావాల్సి వచ్చింది. ఆప్ జాతీయ పార్టీగా మారగానే మరో కార్యాలయం అవసరమైంది. దాంతో కేంద్ర ప్రభుత్వం మా కార్యాలయాలకు కావాల్సిన స్థలాలను కేటాయిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో మాకు స్థలాలు కేటాయించాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇంతవరకు కేంద్రం మాకు ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదు' అని భరద్వాజ్ వెల్లడించారు.

Post a Comment

0 Comments