వి
వేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షిగా పరిగణించడంలో అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు సీబీఐ నివేదించింది. వివేకా హత్య కేసు విచారణను సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం విచారించారు. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలను జైలు నుంచి తీసుకువచ్చి హాజరుపరచగా రిమాండ్‌ను జులై 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. వీరితోపాటు బెయిలుపై ఉన్న దస్తగిరి, డి.శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణనలోకి తీసుకోవాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. దస్తగిరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నారని అన్నారు. సాక్షిగా ఉన్న వ్యక్తిని నిందితుల జాబితాలో చేర్చడం సరికాదని అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కోర్టు క్షమాభిక్ష ప్రసాదించిందని అన్నారు. దీన్ని సవాలు చేస్తూ ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయని వివరించారు. అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దస్తగిరిని నిందితుల జాబితా నుంచి తొలగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నిందితుల తరఫు న్యాయవాదులు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. వివేకా హత్య కేసులో స్వయంగా పాల్గొన్నట్లు దస్తగిరి ఢిల్లీ లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లగా వాంగ్మూలం నమోదు చేసుకుని వదిలిపెట్టారని, మళ్లీ మరోసారి వెళ్లగా అప్పుడూ అదే పనిచేసిందని అన్నారు. ఎవరైనా హత్య చేసి వచ్చామంటే ముందు అరెస్టు చేస్తారని, ఇక్కడ సీబీఐ మాత్రం నిందితుడికి రెడ్‌కార్పెట్‌ వేస్తోందని పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم