పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు నాలుగు నెలలకు రూ.2వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తారు. ఇప్పటికే ఈ పథకం కింద 16 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 32 వేలు జమ అయ్యాయి. త్వరలో 17వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈ పథకంలో రైతులు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇ కేవైసీ చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2 వేలు పెంచింది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు. దీంతో ఏడాదికి రైతుల ఖాతాల్లో రూ.8 వేలు జమ చేయనున్నారు. తాము ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
0 Comments