హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.150 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండో దశ పనులకు రూ.150 కోట్లు, రుణ నిధుల కింద మరో రూ.125 కోట్లు మంజూరు చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక, ఐటీ రంగాల విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్వర్క్ను శివారు ప్రాంతాలకు అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నిధులను కేటాయించారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా నిధులతో మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, ప్రాథమిక పనులు, కారిడార్ల సర్వే పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఐటీ హబ్ పరిధిలోని రాయదుర్గం-కోకాపేట, ఓల్డ్ సిటీ పరిధిలోని ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట, ఇతర శివారు ప్రాంతాలను కలుపుతూ రెండో దశ కారిడార్లను ప్రతిపాదించారు. ప్రభుత్వ రుణాల పద్దు కింద మంజూరు చేసిన రూ.125 కోట్ల నిధుల ద్వారా మెట్రో ప్రాజెక్టు నిర్వహణ, ఆర్థిక బకాయిల సమతుల్యతను వేగవంతం చేయనున్నారు. ఈ నిధుల విడుదల ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు పట్టాలెక్కి, నగర ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
