ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ తర్వాతి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తిరిగిరావాలని సూచిస్తోంది. అలాగే రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి ఈ వర్షాలు మరింత పెరగబోతున్నాయి. ఇవి కాస్తా ఆదివారం నాటికి భారీ వర్షాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనే దానిపై ఆదివారం నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆదివారం కల్లా కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలతో పాటు మత్సకారుల్ని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరుతోంది. ఈ నెలాఖరు కల్లా కోస్తాంధ్రలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం : కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన
byTelugu Lo Computer
•
•
2 min read
