అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు భారీ ఆర్థిక భారం మోపే ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెరపైకి తీసుకొచ్చింది. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోనే సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి భారీ ఫీజు విధించాలని ప్రతిపాదించింది. అయితే ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన కాదని, కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతిపాదిత విధానం ప్రకారం.. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత తొలిసారి ఓపీటీలో పాల్గొనే విదేశీ విద్యార్థుల కోసం 70,000 డాలర్ల ఫీజు విధించాలని డీహెచ్ఎస్ సూచించింది. మరోసారి ఓపీటీలో పాల్గొనే వారికి 30,000 డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా అమెరికాలో చదువుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ ఫీజులు ప్రస్తుతం అమల్లోకి రాలేదు. డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనుంది. అక్టోబర్ 8 నుంచి నవంబర్ 9 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రతిపాదనలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుది నిబంధనలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అమెరికాలో F-1 వీసాపై చదువుకునే అర్హత కలిగిన విదేశీ విద్యార్థులకు ఓపీటీ ఒక ముఖ్యమైన అవకాశంగా ఉంటుంది. చదువుతున్న కోర్సుకు నేరుగా సంబంధించిన రంగంలో ఉద్యోగం లేదా ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు ఓపీటీ ఎంతో కీలకం. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే పనిచేసి అనుభవం సంపాదించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రతిపాదిత విధానంలో ఫీజు చెల్లించే బాధ్యత విద్యార్థి కంటే ముందుగా సంబంధిత విద్యాసంస్థపై ఉంచినట్లు తెలుస్తోంది. విద్యార్థి ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు విద్యాసంస్థ నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థ ఈ ఫీజును చెల్లించకపోతే, అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం నుంచి ఓపీటీ కోసం అవసరమైన అనుమతి లభించకపోవచ్చని ప్రతిపాదనలో పేర్కొన్నారు. వలస వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా ఈ మార్పులను ప్రతిపాదించినట్లు డీహెచ్ఎస్ పేర్కొంది. కొన్ని విద్యాసంస్థలు, ఏజెన్సీలు, విద్యార్థులు ప్రస్తుత వలస నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్లు డీహెచ్ఎస్ ఆరోపించింది. ఈ తరహా దుర్వినియోగాలను నియంత్రించేందుకు కొత్త ఆర్థిక నిబంధనలను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది.
Tags:
000 for foreign students
international
suggested a fee of $70
US Department of Homeland Security Proposes Hefty Fee for Optional Practical Training
