ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ(ఎస్ఆర్పీసీసీ) సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తొలుత ఆయనకు డీజీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, దక్షిణాది రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు, ప్రతినిధులకు రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఆర్పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకమని అన్నారు. తాను సంస్కరణలను విశ్వసిస్తానని చెప్పారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. పోలీసు వ్యవస్థకు మనం అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదు.. మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా తాను భావిస్తున్నాను అని అన్నారు. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా విభజించామని, దీంతో ప్రతి పోలీసు కమిషనర్ పరిమిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు హైడ్రా, ఈగల్, టి-సేఫ్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకంగా మారాయన్నారు. ప్రతి విభాగం, ప్రతి ప్రత్యేక విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందుతోందన్నారు. ప్రధానమంత్రి నిర్వహించిన ప్రగతి సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన మన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని ప్రకటించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు సాధించిందని, సైబర్ నేరాల ద్వారా పోగొట్టుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, .అమెరికాలోని ఎఫ్డీఏ తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు టీజీ-సేఫ్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించామని సీఎం వివరించారు. చెరువులు, సరస్సులు, ఇతర జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా హైడ్రా ప్రజల మన్ననలు పొందుతోందని, అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తుల రక్షణకు కూడా కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
