రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ కుంభకోణం : సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
తెలంగాణాలో రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు కొత్తగా చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనుల్ని ప్యాకేజీలుగా, ముక్కలుగా విభజించి ముందస్తుగా నిర్ణయించుకున్న నచ్చిన వారికే టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు. తక్కువ ధరకు బిడ్లు వేసిన అర్హులైన సంస్థలను పక్కన పెట్టి, సాంకేతిక కారణాల పేరుతో ఇతరులను తొలగించి, ఎక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీలకు పనులు కేటాయించడం ద్వారా వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని విమర్శించారు. వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, టెండర్ల తాలూకు అన్ని పత్రాలను బహిరంగపరచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రతి అనర్హతకు నిర్దిష్ట కారణాలు తెలుపుతూ సాంకేతిక మూల్యాంకన నివేదికతో పాటు మూడు ప్యాకేజీల అంచనా వ్యయాలు, తుది కేటాయింపు విలువలు, బిడ్డర్ల ఆర్థిక బిడ్ల వివరాలను విడుదల చేయాలని కోరారు. బిడ్ ఓపెనింగ్, కంపారేటివ్ స్టేట్మెంట్లు, మూల్యాంకన కమిటీ సమావేశాల మినిట్స్‌తో కూడిన రికార్డులను బయటపెట్టాలన్నారు. రూ.600 కోట్ల ఆర్థిక నష్టం ఆరోపణలపై సమగ్ర పరిశీలన జరిపించాలని, హెచ్ఎండీఏ, హెచ్ జీసీఎల్ పరిధిలోని రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై కాగ్ తో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ టెండర్లపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు, టెండర్ల ప్రక్రియలో పారదర్శకత కోసం స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సాంకేతిక అర్హతలపై నిర్ణయాలు, బిడ్డర్లకు వివరణ ఇచ్చేందుకు కల్పించే అవకాశం, టెక్నికల్ ఫలితాల తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవడానికి అనుసరించే వ్యవధి వంటి అంశాలపై పక్కా నిబంధనలు ఉండాలని కోరారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు తక్షణమే ఈ టెండర్లను రద్దు చేసి పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు.

Post a Comment