ఇండోనేషియాలోని అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండటంతో జకార్తాలోని సోకార్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మొత్తం 209 విమానాల రాకపోకలపై ప్రభావం పడగా, 22,800 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఉన్న అగ్నిపర్వతంలో ఆదివారం ఉదయం 3:53 గంటలకు 30 సెకన్ల పాటు విస్ఫోటనం సంభవించింది. పేలుడు కారణంగా రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక మేఘం దాదాపు 20 వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడి ఈశాన్య దిశగా కదిలింది. ఈ బూడిద ప్రభావం జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలపై పడింది. రెండో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా వ్యాపించి బాంటెన్, లాంపంగ్, బెంగ్‌కులు, దక్షిణ సుండా జలసంధి, సుమత్రా పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతాలపై ప్రభావం చూపింది. సుకర్నో-హట్టా విమానాశ్రయంలో మొదట ఉదయం 5:30 గంటల వరకు విమానాలు నిలిపివేయాలని నిర్ణయించినా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. విమానాశ్రయంలో రాత్రి పార్క్ చేసిన 170 విమానాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేయడంతో పాటు, చెక్-ఇన్ చేసిన సామాన్లను వెనక్కి తీసుకున్నారు. పడవలో వెళుతుండగా అగ్నిపర్వతం బద్ధలు కావడం చూసిన కొందరు, అతి సమీపం నుంచి చిత్రీకరించిన వీడియో వైరల్ గా మారింది.
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం : నిలిచిపోయిన విమాన సర్వీసులు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق