బెంగళూరులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే నెపంతో ఒక మహిళను దారుణంగా కిడ్నాప్ చేసి, నాలుగు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా, ఆమెను బలవంతంగా అర్ధనగ్నంగా మార్చి వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరు సుంకడకట్టే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం రేష్మా బాను వద్ద రూ. 1 లక్ష, నజ్రత్ బేగం వద్ద రూ. 50 వేలు వడ్డీకి అప్పుగా తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్ది నెలలుగా వాయిదాలు చెల్లించలేకపోయింది. ఆగస్టు 27న పని ఇప్పిస్తానని చెప్పి నజ్రత్ బేగం బాధితురాలిని తన ఇంటికి పిలిపించింది. అక్కడికి చేరుకోగానే రేష్మా, ఆమె భర్త సుహైల్, సైఫ్‌లు ఆమెపై దాడి చేసి కత్తితో బెదిరించి కుంబల్‌గోడులోని రేష్మా ఇంటికి బంధించారు. బాధితురాలిని నాలుగు రోజుల పాటు గదిలో బంధించి కర్రలతో కొట్టారు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 11 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 29న ఆమె దుస్తులు విప్పించి అర్ధనగ్నంగా వీడియో తీసి, డబ్బులు ఇవ్వకపోతే వీడియో నెట్‌లో పెడతామని, వేశ్యావృత్తిలోకి దించుతామని బెదిరించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో చంద్ర లేఅవుట్ పోలీసులు ఆగస్టు 31న దాడి చేసి బాధితురాలిని సురక్షితంగా రక్షించారు. నిందితులు రేష్మా బాను, సుహైల్, నజ్రత్ బేగం, సైఫ్‌లపై కిడ్నాప్, దాడి, ఐటీ చట్టం కింద తీవ్రమైన కేసులు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
అప్పు చెల్లించలేదని మహిళ కిడ్నాప్ : అర్ధనగ్నంగా మార్చి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق