పాత డీజిల్ ట్రక్కులు, బస్సులు ఉన్నవారు కొత్త వాహనం కొనాల్సిన అవసరం లేకుండానే కాలుష్యాన్ని భారీగా తగ్గించే అవకాశాన్ని  కేంద్రం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నది. కేవలం రూ.5 వేలతో అమర్చే డివైజ్ పాత వాహనాల ఎమిషన్లను బీఎస్-6 స్థాయికి దగ్గరగా తీసుకురానుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.4, 5వేల ఖర్చుతో అమర్చగలిగే రెట్రోఫిట్ ఎమిషన్ కంట్రోల్ డివైజ్ ను పాత వాహనాల్లో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ సాంకేతికతను ఐఐటీ ఢిల్లీ పరిశోధన ఆధారంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న బీఎస్-3, బీఎస్-4తో పాటు మరింత పాత డీజిల్ ట్రక్కులు, బస్సులకు ఈ డివైజ్‌ను అమర్చుకునే అవకాశం కల్పించనున్నారు. డివైజ్‌ను అమర్చిన వాహనాల ఉద్గారాలను ఆధునిక బీఎస్-6 వాహనాల స్థాయికి దగ్గరగా తీసుకురావచ్చని గడ్కరీ తెలిపారు. రెట్రోఫిట్ డివైజ్ ద్వారా వాహనాల నుంచి వెలువడే పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) కాలుష్యం 90శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు సుమారు 60శాతం వరకు తగ్గించవచ్చని వెల్లడించారు. ఈ టెక్నాలజీ ఇప్పటికే డీజిల్ జనరేటర్ సెట్లలో కాలుష్య నియంత్రణ కోసం ఉపయోగిస్తున్న సాంకేతికతకు సమానమైనదని వెల్లడైంది. ఐఐటీ ఢిల్లీ ఆధారంగా అభివృద్ధి చేసిన కొత్త పరికరంపై పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని గడ్కరీ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పాత, భారీ వాహనాలను స్క్రాప్ చేసి కొత్తవాటితో భర్తీ చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, తక్కువ ఖర్చుతో పాత వాహనాల ఉద్గారాలను తగ్గించే మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో పాత వాహనాలు లేదంటే కాలుష్యాన్నిఅధికంగా విడుదల చేసే భారీ వాహనాలను పూర్తిగా స్క్రాప్ చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితికి రెట్రోఫిట్ డివైజ్ విధానం కొంత ప్రత్యామ్నాయంగా మారనుంది. రెట్రోఫిట్ డివైజ్‌ల అమలుకు అవసరమైన సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏఐఎస్-228ను నోటిఫై చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డివైజ్ పనితీరు, సాంకేతిక అవసరాలు, పాటించాల్సిన ప్రమాణాలను ఈ స్టాండర్డ్‌లో నిర్దేశించనున్నారు. మొత్తంగా చూస్తే.. వేలాది పాత డీజిల్ ట్రక్కులు, బస్సుల వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, వాహన యజమానులపై కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఆర్థిక భారం పడకుండా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది

Post a Comment

أحدث أقدم