తెలంగాణ శాసనసభ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ సోమవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో తమకు జరిగిన తీవ్ర అవమానం, పోలీసుల దురుసు ప్రవర్తనపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై ప్రభుత్వం అహంకారపూరితంగా ప్రవర్తిస్తుందని, తమకు న్యాయం చేయడం లేదన్నారు. తమపై ప్రత్యక్షంగా దాడి జరిగి దెబ్బలు తగిలినా, సభలో పాలకపక్ష సభ్యులు ఆ విషయాన్ని వదిలేసి ఇతర అంశాలపైనే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే స్పందించి విచారం వ్యక్తం చేశారని, కానీ సభలో అధికార పక్ష మహిళా సభ్యులు కనీసం తమ వైపు చూడటానికి కూడా సిద్ధపడలేదని ఆరోపించారు. పోలీసుల తీరును ఎండగడుతూ, తమపై మగ పోలీసులు కావాలనే విరుచుకుపడి లాగిపడేశారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ చుట్టూ మహిళా పోలీసులను బందోబస్తుగా ఉంచి, తమలాంటి మహిళా ప్రజాప్రతినిధుల చుట్టూ మగ పోలీసులను మోహరించడం కాంగ్రెస్ రాజకీయం అని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన కంచెలపై పడిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి అడ్డుపడి కాపాడారని సబిత, సునీతా లక్ష్మారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒకవైపు విదేశాలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం తమకు జరిగిన అవమానంపై పరామర్శిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళా కానిస్టేబుల్కు ఇబ్బంది కలిగిందంటూ తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవంలో భాగం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ తీవ్రమైన అంశంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సభలో నాటకాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో సమాచారం అందుకునే ప్రభుత్వానికి, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి సమాచారం ఎందుకు చేరలేదని మహిళా ఎమ్మెల్యేలు నిలదీశారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మహిళల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, తమకు జరిగిన అవమానానికి సీఎం తక్షణమే సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమకు జరిగిన అవమానానికి సీఎం తక్షణమే సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق