క్రెయిన్-పోలాండ్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న యహోదిన్ ప్రాంతంలో రష్యా డ్రోన్‌ ప్రయాణికుల రైలును ఢీకొట్టింది. రైలులోని ఇంజిన్‌ను డ్రోన్‌ తాకినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరినీ అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు పలువురు యూరోపియన్‌ భద్రతా అధికారులు అదే రైల్వే మార్గంలో కొద్దిసేపటి ముందే మరో రైలులో ప్రయాణించారు. కీవ్‌లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్ పావెల్ కూడా ఆ బృందంలో ఉన్నారు. రష్యా మాత్రం పశ్చిమ ఉక్రెయిన్‌లోని "రైల్వే మౌలిక వసతులపై" దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియా మాత్రం ఈ డ్రోన్‌ దౌత్య ప్రతినిధులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఈ దాడి సాధారణ రైల్వే దాడేనా? లేక యూరోపియన్‌ ప్రతినిధుల కదలికలపై రష్యాకు ముందస్తు సమాచారం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో యహోదిన్ స్టేషన్‌లో మరో రైలులో ఉన్న అమెరికా మాజీ సీఐఏ అధిపతి డేవిడ్ పెట్రాయస్ ఈ ఘటనను భయానకంగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న పరిస్థితికి ఇది మరో ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. దాడికి కేవలం 15 నిమిషాల ముందు రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు ఉక్రెయిన్ రైల్వే సంస్థ వెల్లడించింది. రష్యా దాడుల ముప్పు కారణంగా రైలు నిర్ణీత సమయానికి భిన్నంగా ముందుగానే స్టేషన్‌ నుంచి బయలుదేరినట్లు కూడా తెలిపింది. ఉక్రెయిన్, పోలాండ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం డ్రోన్‌ దాడి పోలాండ్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జరిగింది. అంటే నాటో సభ్యదేశమైన పోలాండ్ సరిహద్దుకు రష్యా దాడులు మరింత చేరువవుతున్నాయన్న ఆందోళన సహజంగానే పెరిగింది. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్ట్ కూడా అదే సమయంలో కీవ్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలును కొంతసేపు ఆపి, ప్రయాణికులను అత్యవసర తరలింపునకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితి అదుపులో ఉందని సమాచారం వచ్చిన తర్వాత ఆ రైలు పోలాండ్‌లోని డోరోహుస్క్ సరిహద్దు స్టేషన్‌కు సురక్షితంగా చేరింది. ఈ పరిణామంపై పోలాండ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రధాని డొనాల్డ్ టస్క్ అత్యవసర సమావేశం నిర్వహించారు. రష్యా చర్యలు క్రమంగా తమ సరిహద్దులకు దగ్గరవుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా కూడా రష్యా దాడులు యూరోపియన్ యూనియన్, నాటో తలుపుల వద్దకు చేరుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ మాత్రం మరిన్ని వైమానిక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా రష్యా వేగవంతమైన క్షిపణులు, జెట్‌ ఆధారిత డ్రోన్లను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్లను అందించాలని మిత్రదేశాలను కోరుతోంది.

Post a Comment

أحدث أقدم