నాగాలాండ్‌లో కల్తీ మద్యం తాగి 19 మంది దుర్మరణం
Saturday, September 26, 2026
19 Die After Consuming Spurious Liquor in Nagaland impaired vision Mokokchung and Tuensang districts suffering from symptoms such as severe abdominal pain victims collapsed vomiting
నాగాలాండ్‌లో అనుమానాస్పద నాటుసారా, కల్తీ మద్యం సేవించి గడిచిన రెండు రోజుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు ప్రధానంగా మొకోక్‌చుంగ్, తుయెన్‌సాంగ్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. మొకోక్‌చుంగ్ జిల్లాలో 8 మంది, పొరుగున ఉన్న తుయెన్‌సాంగ్ జిల్లాలో 11 మంది ఈ కల్తీ మద్యం బారినపడి మృతి చెందినట్లు పోలీసులు శనివారం అధికారికంగా ధ్రువీకరించారు. మద్యం తాగిన కొద్దిసేపటికే బాధితులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, చూపు మందగించడం వంటి లక్షణాలతో కుప్పకూలిపోయారని, ఆస్పత్రికి తరలించే లోపే ఎక్కువ మంది మరణించారని స్థానికులు తెలిపారు. 1990 నుంచే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో కల్తీ మద్యం విక్రయాలు జరిగి ప్రాణాలు పోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ విషాద ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించడంతో నాగాలాండ్ పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. కల్తీ మద్యం సరఫరా వెనుక ఉన్న మూలాలు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) ఐ. బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు సీనియర్ ఎస్పీ వెసుప్రా కేజో శనివారం వెల్లడించారు. ఈ కల్తీ సారా ఎక్కడి నుంచి సరఫరా అయింది, సరిహద్దుల గుండా అక్రమంగా రవాణా చేశారా అనే కోణాల్లో సిట్ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, మద్యం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అక్రమ లిక్కర్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతామని, ఈ దారుణానికి కారకులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
No comments:
Post a Comment