తెలంగాణ లోని బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై ఉచితంగా అందించనున్నారు. ఒక్కో మిషన్ విలువ సుమారు రూ.12,000 వరకు ఉంటుంది. అయితే, తాజాగా ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు, లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలను ప్రకటించింది. 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉన్న బీసీ నిరుద్యోగ మహిళలు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక రాబడి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన పెట్టారు. ఒక కుటుంబానికి ఒకే కుట్టు మిషన్ మాత్రమే మంజూరు చేయనున్నారు. 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పథకంలో భాగంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, ముందే కుట్టు పనిలో అనుభవం, నైపుణ్యం ఉన్నవారికి లబ్ధిదారుల ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హత కలిగిన మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంక్ పాస్‌బుక్ వివరాను తెలంగాణ ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
إرسال تعليق