అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో ఈ భారీ మార్పు కనిపించింది. ఇటీవల వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ.. తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించాయి. ట్రేడింగ్ సమయంలో ధరలు వేగంగా పడిపోవడం మార్కెట్‌లో ఆందోళనకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల్లో పురోగతి వస్తుందన్న అంచనాలు. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే, భవిష్యత్తులో చమురు సరఫరా సులభతరం అవుతుందని మార్కెట్లు భావిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఉన్న అనిశ్చితి కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే ఇంధన డిమాండ్ తగ్గుతుందనే అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. చమురు ధరలు తగ్గుదల వినియోగదారులకు కొంత ఊరటనిస్తుంది.
إرسال تعليق