ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో సోమవారం ఒకరోజు శాంతియుత నిరసన దీక్ష నిర్వహించారు. 'చలో పార్లమెంట్' కార్యక్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మద్దతు తెలిపాయి. ఏపీఎఫ్‌డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఈశ్వరరావు నాయకత్వంలో రాష్ట్ర ప్రతినిధుల బృందం ఉద్యమంలో పాల్గొంది. ఉద్దానం మీడియా వ్యవస్థాపకులు భావన శ్రీకాంత్ జంతర్‌మంతర్ వద్ద ప్రసంగించి గ్రామీణ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్, సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అవి ఇంకా అమలులోకి రాలేదన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భావన శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామీణ విలేకరులు అనేక ఇబ్బందుల మధ్య విధులు నిర్వహిస్తున్నారని, వారికి వృత్తి భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు జాతీయ పెన్షన్, రైల్వే ప్రయాణాల్లో 50 శాతం రాయితీ, జర్నలిస్టుల రక్షణ చట్టం, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, కనీస వేతనాల అమలు వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

أحدث أقدم