తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకంలో కీలక మార్పులు చేస్తూ తాజాగా మార్గదర్శకాలను వెల్లడించింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) తరహాలో ఎన్‌ఈహెచ్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త పథకం కింద 40 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులకు ఏటా ఉచితంగా సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పాత పథకంలో నాన్ ప్యాకేజీ వైద్య సేవల పరిమితి రూ.2 లక్షల వరకే ఉండగా, తాజాగా పథకంలో రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా మార్గదర్శకాల మేరకు 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏటా ఒకసారి ఉచితంగా సమగ్ర 'మాస్టర్ హెల్త్ చెకప్' సేవలను అందుబాటులోకి తెచ్చారు. లబ్ధిదారులకు క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత డిజిటల్ హెల్త్ కార్డులను అందుబాటులోకి తేగా, వెబ్‌పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా వీటిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుత పథకంలో అవుట్‌పేషెంట్ సేవలు అందు బాటులో లేకపోగా, కొత్త పథకంలో ఎంపానెల్ అయిన ఆసుపత్రుల్లో ఓపీడీ కన్సల్టేషన్ మరియు ల్యాబ్ పరీక్షలపై 50 శాతం రాయితీ కల్పించారు. నాన్-ప్యాకేజీ చికిత్సల పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ పథకం నిర్వహణ కోసం ఉద్యోగి లేదా పెన్షనర్ తమ మూల వేతనం/ పెన్షన్ లో 1.5 శాతం చందాను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, అంతే మొత్తంలో (1.5%) మొత్తాన్ని ప్రభుత్వం కూడా జత చేసి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నిధికి జమ చేస్తుంది. సుమారు 943కి పైగా నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా 17.88 లక్షల మంది లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి రానుంది. ఉద్యోగి భార్య లేదా భర్త, వారిపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, దత్తత పిల్లలు ఈ పథకానికి అర్హులు. నిరుద్యోగ కుమార్తె వివాహం అయ్యే వరకు.. అలాగే వితంతువు, విడాకులు పొందిన లేదా భర్త నుంచి విడిపోయిన కుమార్తె కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. నిరుద్యోగ కుమారుడికి 25 ఏళ్లు వచ్చేవరకు ఈ పథకం కింద వైద్యం పొందే అవకాశం ఉంది. శాశ్వత వికలాంగ పిల్లలకు వయోపరిమితి వర్తించదు. ప్రస్తుత ఈహెచ్‌ఎస్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకం ఆరోగ్య పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق