హారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోతల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉంద్యాల పంప్‌హౌస్ స్టేజ్-1 ద్వారా ప్రస్తుతం 315 క్యూసెక్కుల నీటిని కోయిల్‌సాగర్ జలాశయానికి ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా పరివాహక ప్రాంతాల్లోని రైతులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు అధికారులు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయం వైపు పరుగులు పెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ కృష్ణా నది ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి వచ్చే వరద ప్రవాహం భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుకుంటోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. 30,722 క్యూసెక్కుల నీటిని అవుట్‌ఫ్లో రూపంలో దిగువకు వదులుతున్నారు. ఈ నీరు మొత్తం కూడా శ్రీశైలానికి చేరకుంటోంది. అక్కడ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులకు సైతం నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు ఈ నీరు ఎంతో కీలకం కానుంది.

Post a Comment

أحدث أقدم