పాన్‌లో యానిమే స్ట్రీమింగ్‌ సేవ అయిన బందాయ్‌ ఛానల్‌పై 15 ఏళ్ల విద్యార్థి సైబర్‌ దాడికి పాల్పడ్డాడు. చాట్‌జీపీటీ సాయంతో కోడింగ్‌ను బ్రేక్‌ చేసి, ఏకంగా 46,812 మంది వినియోగదారుల ఖాతాలు హ్యాక్‌ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కంపెనీ అప్రమత్తమై ఆ ఖాతాలను నిలిపివేసింది. సంస్థ సేవలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. టోక్యో మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్న నిందితుడు బందాయ్‌ ఛానల్‌ వ్యవస్థలోని భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని ఉపయోగించుకునేందుకు అతడు ఆటోమేటెడ్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్‌లోని కొంత భాగాన్ని పూర్తి చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. ఖాతాల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన కోడ్‌ను తానే రూపొందించానని, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో మరో ప్రోగ్రామింగ్‌ భాషలో పూర్తి చేసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన కిందటి ఏడాది చివర్లో జరిగింది. 2025 నవంబర్‌ 4న బందాయ్‌ ఛానల్‌ సర్వర్లకు అనధికార ఆదేశాలు పంపారు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారుల సభ్యత్వాలు రద్దయ్యాయి. ఈ ప్రభావంతో నవంబర్‌ 6 నుంచి సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత డిసెంబర్‌లో సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు బందాయ్‌ ఛానల్‌ వెల్లడించింది. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ అతడి యాక్సెస్‌ను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుడు తన ఐపీ అడ్రస్‌ను దాదాపు 30 సార్లు మార్చి మళ్లీ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యవస్థలోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల సమాచారాన్ని చేరుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నారు. విచారణలో బాలుడు ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అయితే బందాయ్‌ ఛానల్‌పై తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి ఉందని, నాలుగో తరగతిలోనే వాటిని ఉపయోగించడం ప్రారంభించానని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా ఈ సమాచారాన్ని యాక్సెస్‌ చేయగలిగానని, సంస్థను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపించడంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు బాలుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిందితుడు చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాడు. ప్రాథమిక పాఠశాల దశలోనే కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. సైబర్‌ దాడి తర్వాత బందాయ్‌ ఛానల్‌ ప్రభావిత వినియోగదారులకు సమాచారం అందించింది. నకిలీ ఈమెయిల్స్‌, ఫిషింగ్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దైన సభ్యత్వాలను తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలైన రుసుములను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే వినియోగదారుల సమాచారం బయటకు లీకైందని లేదా దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.

Post a Comment

أحدث أقدم