వారణాసి నగరం నుంచి మాంసం దుకాణాలను తరలించే ప్రణాళికకు మున్సిపల్ కార్పొరేషన్ ఓకే చెప్పింది. వచ్చే 6 నెలల్లో దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. నగర పరిశుభ్రత, పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మేయర్ అశోక్ తివారీ అధ్యక్షతన జరిగిన కార్పొరేషన్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మాంసం, చేపల మార్కెట్లను తొలి దశలో నగరంలోని ఐదు ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నారు. రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవ్లేశ్‌పూర్, శివ్‌పూర్ ప్రాంతాలకు షాపుల్ని తరలిస్తారు. ప్రస్తుతం వారణాసి నగర పరిధిలో సుమారు 350 నుంచి 400 వరకు మాంసం, చేపల దుకాణాలు ఉన్నాయి. వీటిని శివార్లకు తరలించడం ద్వారా పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు మార్కెట్ల నిర్వహణ సులువు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలను నగరం బయటకు తరలిస్తే వినియోగదారులు రోజూవారీ కొనుగోళ్ల కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుందని అంటున్నారు. వ్యాపారులు, ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అధికారుల్ని కోరుతున్నారు.

Post a Comment

أحدث أقدم