తెలంగాణలో రాగల కొద్ధి రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో, అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేలా అవసరమైనన్ని టార్పాలిన్లను (పాలిథిన్ కవర్లను) అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుండి టార్పాలిన్లను తక్షణమే అవసరమున్న ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వర్షాలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజా రక్షణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు. విద్యుత్ స్తంభాలు, పాతపడిపోయిన గోడలు, చెట్ల కింద ఎవరూ ఆశ్రయం పొందవద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణకు వర్ష సూచన : ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق