కేరళ రాష్ట్రాన్ని తీవ్రమైన వడగాడ్పులు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో, ప్రజలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోవిడ్-19 సమయంలో లాగా స్వచ్ఛందంగా సెల్ఫ్-లాక్‌డౌన్ పాటించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. పాలక్కాడ్, కొల్లాం, మరియు త్రిస్సూర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో భారత వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎండ తీవ్రత మరింత ఎక్కువగా అనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని సీఎం పినరయి విజయన్ హెచ్చరించారు. ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న సమయాల్లో ఆరుబయట జరిగే బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాలు, పరేడ్‌లు, బాణసంచా కాల్చడం వంటి వాటిని ప్రభుత్వం నిషేధించింది. ఎండలో పనిచేసే కార్మికులకు ఉపశమనం కలిగించేలా వివిధ శాఖల్లో పనివేళలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. పగటిపూట ఉపాధి హామీ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండల కారణంగా అనారోగ్యానికి గురయ్యే వారికి తక్షణ వైద్యం అందించేలా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సేవలను అప్రమత్తంగా ఉంచారు.
కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న వడగాడ్పులు : సెల్ఫ్ లాక్‌డౌన్ పాటించమంటున్న సీఎం పినరయి విజయన్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق