ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధ పాఠాలను బోధించే నూతన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర విద్యాశాఖ 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్', 'పై జామ్ ఫౌండేషన్' భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు మరియు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు 2,000 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఏటా 20 నుంచి 25 గంటల పాటు ఏఐ ప్రాథమిక అంశాలు, డేటా వినియోగం వంటి విషయాలను అభ్యసిస్తారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్ చేయడానికి 'telangana.codemitra.org' అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కేవలం విద్యార్థులకే కాకుండా, ఈ అధునాతన సాంకేతికతను బోధించడానికి సుమారు 28,000 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏఐ, డిజైన్ థింకింగ్ వంటి అంశాలను పాఠ్యాంశాల్లో అంతర్భాగం చేయడమే లక్ష్యమని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడమే ఈ బృహత్తర కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
విద్యార్థులకు కృత్రిమ మేధ పాఠాలను బోధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق