యస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర లాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన 45 శాతం ఎగిసి రూ.1 ,068 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 739 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 9,356 కోట్ల నుంచి రూ. 9,381 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 7,616 కోట్ల నుంచి రూ. 7,650 కోట్లకు పెరిగింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ 41 శాతం తగ్గి రూ. 187 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్‌ రుణాల విభాగం దన్నుతో రుణ వృద్ధి 10.7 శాతం మేర పెరిగింది. నికర వడ్డీ మార్చిన్‌ 2.5 శాతం నుంచి 2.7 శాతానికి మెరుగుపడింది. డిపాజిట్లు రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లకు చేరుకున్నాయి. కొత్త ఎండీ, సీఈవోగా వినయ్‌ ఎం టోన్సే బాధ్యతలు చేపట్టాక బ్యాంకు ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని గైడెన్స్‌కి అనుగుణంగా పటిష్టమైన ఫలితాలతో ముగించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండు, మూడేళ్లలో మార్జిన్లను 3.25 - 3.50 శాతం స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. నికర వడ్డీ మార్జిన్లు 20 బేసిస్‌ పాయింట్ల మేర మెరుగుపడినట్లు చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరం మొండిపద్దులు అత్యంత కనిష్ట స్థాయికి నెమ్మదించాయని పేర్కొన్నారు. మరింత మెరుగైన వృద్ధిని సాధించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ ముందుకు సాగనున్నట్లు వివరించారు.

Post a Comment

أحدث أقدم