హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన ఉగాది పర్వదిన పంచాంగ శ్రవణ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఈ పరాభవ నామ నూతన సంవత్సరాన్ని "రైతు నామ సంవత్సరం"గా అభివర్ణించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతును రాజుగా నిలబెట్టే దిశగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కొండా రేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు అదనంగా బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులపై అత్యల్ప రుణభారం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సుమారు 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడుతున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కలిగించేందుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి రైతులను రుణభారం నుంచి విముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 22న మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి వ్యవస్థలో ఉన్న లోపాలను తొలగించి భూ భారతి ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పరాభవ నామ సంవత్సరాన్ని "రైతు నామ సంవత్సరం"గా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق