ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుందే నరవణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ' పుస్తకం విడుదలకు ముందే సోషల్ మీడియాలో సర్కులేట్ అవ్వడం వివాదాస్పదం అవుతుంది.  దీనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తాజాగా పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియాకు నోటీసులు పంపారు. ప్రచురితం కాని పుస్తకానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ వాటికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నరవణే పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదంపై పెంగ్విన్ సంస్థ 24 గంటల్లో రెండుసార్లు సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇచ్చింది. ఈ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని తొలుత పేర్కొంది. విడుదల కాబోతోన్న పుస్తకం, ప్రీ ఆర్డ్‌ర్‌కు అందుబాటులో ఉన్న పుస్తకం, పబ్లిష్డ్ పుస్తకం ఒకటి కాదని మార్కెట్లో అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చినప్పుడే పబ్లిష్డ్‌గా పరిగణించాలని రెండోసారి వివరణలో పేర్కొంది. నరవణే పుస్తకానికి సంబంధించి వచ్చిన ఒక ఆర్టికల్‌ను రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. రాహుల్ చర్చలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుంటూ ఇంకా విడుదల కాని పుస్తకం గురించి ఎలా ప్రస్తావిస్తారని నిలదీశారు. పుస్తకానికి రక్షణ శాఖ అనుమతి అవసరం. అయితే అనుమతి ఇవ్వలేదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గత వారం ఆ పుస్తకాన్ని పార్లమెంటు వెలుపల ప్రదర్శించడంతో వివాదం ముదిరింది. అయితే పెంగ్విన్ సంస్థ ఇచ్చిన  ప్రకటనను నరవణే సమర్ధించారు. 'ఇదే ఆ పుస్తకం స్థితి' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. పెంగ్విన్ ప్రకటనను దాంతో షేర్ చేశారు.

Post a Comment

أحدث أقدم